ఒక భాషలోని సాహిత్యంలో కనిపించే వైవిధ్యం ఆ జాతి సాంస్కృతిక చైతన్యాన్ని, ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుందని హెచ్.సి.యు ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.  సోమవారం నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడుపేట, నెల్లూరు వారు  ‘ తెలుగు సాహిత్యం- ఆధునిక ప్రక్రియలు’ పేరుతో డా.యం.మధుసూదనశర్మ అధ్యక్షతన నిర్వహించిన  ఒకరోజు జాతీయ అంతర్జాల సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి అనీ, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మాట్లాడుతున్నారని, అందువల్ల కవులు, రచయితలు తీసుకొనే వస్తువులోను, ప్రక్రియల్లోను  ఎంతో వైవిధ్యం కనిపిస్తుందని ఆయన వివరించారు. నన్నయ, పాల్కురికి సోమనాథుడు తెలుగు భాషకు సుస్థిరమైన స్థాయిని కలిగించే రచనలు చేశారనీ, ఆ ప్రభావంతో కావ్యం, ప్రబంధం, శతకం, దండకం,  నాటకం, యక్షగానం వంటి ప్రక్రియలు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయన్నారు. తొలిదశలో ఛందస్సుకి ప్రాధాన్యం ఇవ్వవలసివచ్చిందనీ, దానివల్ల ఆ సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి  వీలుకలిగిందన్నారు. ఆధునిక కాలంలో ముద్రణా రంగంతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ భావాలను శక్తివంతంగా , వేగవంతంగా వ్యాప్తి చేయగలుగుతున్నారు. మనకున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధి ఆధునిక కాలంలో సమయం చాలా వేగవంతంగా నడిపిస్తుందనీ, ఆధునికత మనల్ని నిరంతరం పోటీపడవలసిన పరిస్థితుల్లోకి పెట్టేస్తుందనీ దీనికి అనుగుణంగానే సాహిత్యంలోనూ మార్పులు వస్తున్నాయన్నారు. ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికున్నంత సమయం ఆధునిక కాలంలో దొరకట్లేదు. అందువల్ల ఆధునిక సాహిత్య ప్రక్రియల్లోనూ నిరంతరం మార్పులు తప్పవన్నారు. ప్రాచీన సాహిత్యంలో సమకాలీనత ఉంటుంది. కానీ, ఆధునిక సాహిత్యంలో సామాజికత ఉంటుందనీ, అదే సామాన్యుడిని సైతం కవిగా, రచయితగా మారుస్తుందన్నారు. ఉత్పత్తికులాల జీవితాలే ఆధునిక సాహిత్యంలో కనిపిస్తున్నాయని, శాశ్వతంగా నిలిచేదే బహుజనులు రాసిందే నిజమైన కవిత్వమని  తెలంగాణ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ఆచార్య పి.కనకయ్య పేర్కొన్నారు.

ఆధునిక సాహిత్యంలో కవిత్వానికి ఎంతో ప్రత్యేకత ఉందని వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు, దేవులపల్లి, శ్రీశ్రీ  మొదలు ఆధునిక కవుల వరకు గల వస్తు, శిల్ప విశిష్టతలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య ఎన్వీ కృష్ణారావు వివరించారు.  ఆధునిక సాహిత్యంపై ప్రాచ్య, పాశ్చాత్య ప్రభావాన్ని సమన్యయించుకొంటూ నూతనత్వానికి నాంది పలికిన ఆధునిక సాహిత్య ప్రక్రియలు గురించి విద్యార్థులకు ఒక అవగాహన కలిగించడమే ఈసదస్సు లక్ష్యమని   సంచాలకు డా.సిహెచ్.విజయకుమార్ వివరించారు. ఈ సదస్సులో నిర్వాహకులు డా.యస్.హెచ్.పి.కిరణ్ కుమార్, పెద్దసంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది సాహితీవేత్తలు పాల్గొన్నారు.