(దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలు)

 

నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాట కాలంలో తన మహోన్నతమైన సాహిత్యంతో, పద్య రచనలతో తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని వక్తలు కొనియాడారు. శుక్రవారం నాడు( 22.7.2022) హెచ్ సి.యూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యులు గారి 98వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధాన వక్తగా ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ తెలంగాణలో కవుల సహజ లక్షణాలను కొన్నింటిని ప్రత్యేకంగా వివరించారు. వాటిలో రాచరిక నిరసన, నిరాడంబరమైన జీవనాన్ని కోరుకోవడం, కవిత్వాన్ని ప్రజాపరం చేయడం, ఆధిపత్య సంస్కృతిని నిరసించడం వంటి ప్రధాన లక్షణాలను పుణికి పుచ్చుకొని దాశరధి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన వివరించారు. దాశరధి రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం లాంటి కావ్యాల ద్వారా తెలంగాణ జనజీవంలోని సంఘర్షణను అద్భుతంగా కవిత్వికరించిన మహాకవి దాశరథి అని ఆచార్య పిల్లలమర్రి రాములు వాటిని సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పమ్మి పవన్ కుమార్ ,ఆచార్య డి. విజయలక్ష్మి, డాక్టర్ బాణాల భుజంగ రెడ్డి తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి డాక్టర్ భూక్య తిరుపతి వందన సమర్పణ చేశారు.