‘మానవతావిలువల్ని పెంచేదే నిజమైన సాహిత్యమనీ, మనసుని నిర్మలంగా పరివర్తన చేయగలిగిన శక్తి సాహిత్యానికే ఉందనీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు డి.యస్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు శాఖ, ఐక్యుఏసి సంయుక్తంగా నిర్వహించిన ‘ సాహిత్యం-మానవతావిలువలు’ పేరుతో ఒకరోజు అంతర్జాల అంతర్జాతీయ సదస్సు ( International Webinar ) లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. మనిషిని కేంద్రంగా చేసుకుని మానవుడిలో ఉండాల్సిన ప్రేమ,కరుణ, పరస్పర సహకారం, దానగుణాన్ని కలిగి ఉండడం, మాటలు, ఆలోచన, చేతలు వంటివన్నీ మానవత్వాన్ని పెంపొందిస్తాయని అవన్నీ వివిధ కథలు, పాత్రలు ద్వారా ప్రాచీన తెలుగు సాహిత్యంలో కూడా మానవతా విలువలు ఉన్నాయని వాటిని సోదాహరణంగా ఆయన వివరించారు.
తెలుగు సాహిత్యంలో నన్నయ జగత్తుకి హితాన్ని కలిగించడమే తన సాహిత్య లక్ష్యంగా పేర్కొన్నారని ఆచార్య దార్ల చెప్పారు. తిక్కన, ఎర్రని, శ్రీనాథుడు,వేమన, గుర్రం జాషువా, డా.సి.నారాయణరెడ్డి, ఎన్.గోపి, ఎన్.ఈశ్వరరెడ్డి తదితరుల సాహిత్యంలో ప్రతిఫలించే మానవతా విలువలను సోదాహరణంగా వివరించారు. మతం, కులం, ప్రాంతం వంటి వాటిని బోధించేటప్పుడు వీటిలో నిగూఢంగా దాగిఉన్న మానవతా విలువలను బోధించాలని ఆయన అన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఇ.మాధవి, అతిథులుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డా.బూసి వెంకటస్వామి, సదస్సు నిర్వాహకులు శ్రీమతి పి.యామినీ అమ్మాజి, శ్రీమతి పి.కుసుమకుమారి,. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గం కళ్యాణి, కామర్స్ శాఖాధిపతి సిహెచ్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.