భారతీయుల జీవితానుభవాలు, సంఘర్షణలే అవతలి గుడిసె నవల

మూల రచయిత రచనతో పాటు, అనువాద శైలిని కూడా కళాత్మకంగా అవతలి గుడిసె లో అందించారనీ, మనజీవితానుభవాలే ఈ నవల్లో కనిపిస్తాయని  ఆచార్య ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.  మంగళవారం వారం మధ్యాహ్నం (22.3.2022) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మానవీయ శాస్త్రాల విభాగం ఆడిటోరియంలో ఎస్.హెచ్. డీన్ ఆచార్య వి.కృష్ణ తెలుగు అనువాద నవల *అవతలి గుడిసె* ఆవిష్కరణ సభ జరిగింది. కొత్త పుస్తకంతో కాసేపు కార్యక్రమంలో భాగంగా తెలుగు శాఖ మరియు దళిత, ఆదివాసీ అధ్యయనం, అనువాద కేంద్రం వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హెచ్ సియు ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ అధ్యక్షుడు, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సామాజిక శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య ఘంటా చక్రపాణి నవలను ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయ సమాజంలో 70 ప్రాంతాలలో దళితుల జీవితాల్ని, ఆ సంఘర్షణల్ని వాస్తవికంగా కళాత్మకంగా ప్రతిఫలించిన నవలగా అభివర్ణించారు. హిందీలో డా.ప్రకాశ్ కర్ధమ్ ఛప్పర్ పేరుతో రాసిన దాన్ని తెలుగులో మంచి శైలితో ఆచార్య వి.కృష్ణ అనువాదం కొనసాగిందన్నారు. హిందీ సాహిత్యంలో ప్రసిద్ధమైన కవి, రచయిత డా.ప్రకాశ్ కర్ధమ్ ఆలోచనా దృక్పథం తెలియడంతో పాటు, భారతీయ సమాజంలో ప్రజలెలా ఆలోచిస్తున్నారో తెలుస్తుందని ఆచార్య ఆర్.ఎస్.సర్రాజు వివరించారు. హిందీ మూల రచయిత డా.ప్రకాశ్ కర్ధమ్ మాట్లాడుతూ అనువాదకునికి భాషలో నైపుణ్యంతో పాటు, ఆ వస్తువు మీద అవగాహన ఉన్నప్పుడు అది స్వతంత్ర రచనలా వస్తుందనీ, దానిలో ఆచార్య కృష్ణ విజయవంతమయ్యారని ప్రశంసించి, తన రచనల నేపథ్యాన్ని వివరించారు. అంబేద్కర్ , వాస్తవసంఘటన ఆధారంగా బౌద్ధ ప్రభావం, అహింసాయుత ఉద్యమాల ద్వారా దళిత సమస్యను కళాత్మకంగా అందించే ప్రయత్నం చేశానన్నారు. అంబేద్కర్,  బౌద్ధిజం ప్రభావాల భావాల్ని కలబోసి, మానవీయ పరిమళాల్ని వెదజల్లుతూ కళాత్మక సత్యాన్ని ఈ నవలలో ఆవిష్కరించారని గ్రంథసమీక్ష చేసిన తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు  అన్నారు. తెలుగు అనువాద నవలా రచయిత ఆచార్య వి.కృష్ణ  వస్తు వైవిధ్యం, దాన్ని తీర్చిదిద్దిన శిల్ప నైపుణ్యం, సామాజిక పరివర్తను ఆశించే లక్ష్యాలు తనకు నచ్చి ఈ రచనను అనువదించానని తన స్పందనను తెలిపారు. ఈ సమావేశంలో సిడాస్ట్ అధ్యక్షుడు ఆచార్య విష్ణురానడే సెంటర్ చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో అతిథులు ఆచార్య పిల్లలమర్రి రాములు పరిచయం చేసి స్వాగతం పలకగా, ఆచార్య ఎం.గోనానాయక్ వందన సమర్పణ చేశారు. కరోనా తర్వాత ప్రత్యక్షంగా జరిగిన ఈ సమావేశంలో అత్యధిక సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.