తన రచనల ద్వారా పీడిత వర్గంలో చైతన్యాన్ని నింపి ప్రభుత్వ యంత్రాంగాన్ని జాగృతం చేసిన గొప్ప రచయిత రావిశాస్త్రి ( రాచకొండ విశ్వనాథ శాస్త్రి) అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం వారు నిర్వహిస్తున్న మూడు రోజులపాటు ( 29, 30, 31 July 2022) ‘రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహిత్య సమాలోచనం పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు (International Seminar on Raavi Sastry Life and Literature) శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభలో కీలకోపన్యాసం చేయవలసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కొన్ని అత్యవసర పనులు వల్ల ప్రత్యక్షంగా పాల్గొనలేక, అంతర్జాలం ద్వారా హెచ్ సియు నుండే తన ప్రధానమైన కీలకోపన్యాసాన్ని చేశారు. తెలుగు వాక్యానికి కవితాత్మను జత చేసి పాఠకులను రస భరితం చేయడంతో పాటు వస్తువుని శాశ్వతంగా గుర్తుండిపోయేటట్లుగా చెప్పగలిగిన గొప్ప శైలి రావిశాస్త్రి గారిదని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. రావిశాస్త్రి జన్మించి ఈ ఏడాదికి నూరు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా తెలుగు సమాజమంతా ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.ఆయన సుమారు 46 కథలు 8 నవలలు, కొన్ని ఎలిజీలు, అనేక వ్యాసాలు రాశారు.ఆయన రచనలలో మార్క్సిస్టు దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది.
తొలుత గాంధీయిజంపై కొంత ఇష్టాన్ని కనపరిచినా, తర్వాత కాలంలో పీడితులు అంత ఏకమైతే కానీ తమ సమస్యలు పరిష్కరించుకోలేరని ఒక సామాజిక వాస్తవిక దృక్పథంతో ఆయన రచనలు కొనసాగించారు.
ప్రభుత్వ పాలన రంగాలలో కోర్టులు, పోలీసులు, అధిరాయంత్రాంగం, రాజకీయ నాయకులు, భూస్వాములు మొదలైన వాళ్లంతా పేదలను ఏ విధంగా అణచివేతకు గురి చేస్తూ వారిని పీడిస్తున్నారో తన రచనల ద్వారా సమాజానికి తెలియజేసి వాటి నుండి ఆ ప్రజలు ఎలా తమను తాము రక్షించుకోవాలో తెలియచెప్పిన గొప్ప సామాజిక బాధ్యత గల రచయిత రావిశాస్త్రి.స్వయంగా లాయర్ అయిన రచయిత రావిశాస్త్రి. ఆయన ప్రతి రచనలోనూ న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పాలన యంత్రాంగం,రాజకీయ వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో, అవన్నీ తమకి అనుకూలంగా ఎలా ఈ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నాయో కళ్ళకు కట్టినట్లు వర్ణించిన రచయిత రావిశాస్త్రి.
తన చివరి రచన ఇల్లు నవలలలో రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న దుర్మార్గాలను వర్ణించారని రావిశాస్త్రి జీవితాన్ని, సాహిత్యాన్ని, సామాజిక దృక్పథం మొదలైన అంశాలను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు.
ఈ ప్రారంభ సభకు సదస్సులో సంచాలకులు డాక్టర్ కె.వి.ఎన్. .డి. వరప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య మొక్కపాటి జగన్నాధ రావు సదస్సుని ప్రారంభించి మాట్లాడారు. శతజయంతి సందర్భంగా రావిశాస్త్రి రచనలను ఏం చేయడానికి ఈ మూడు రోజుల సదస్సు ఉపయోగపడుతుందని అందుకని ఈ సదస్సుని నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సదస్సులోప్రముఖ సాహిత్య విమర్శకులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ( యోగివేమన విశ్వవిద్యాలయం, కడప),ప్రముఖ పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి ( బెంగళూరు విశ్వవిద్యాలయం), ఆచార్య మలయ వాసిని, ఆచార్య వి.సిమ్మన్న (ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు), ఆచార్య శివుని రాజేశ్వరి (శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి), ఆచార్య ఎం.రామనాథం నాయుడు (కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు), డా.ఎన్.ఈశ్వరరెడ్డి , యోగివేమన విశ్వవిద్యాలయం), డా.రంకిరెడ్డి రామమోహనరావు (మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు), రావిశాస్త్రి గారి కుమారుడు ఉమా కుమార శాస్త్రి , ప్రముఖ సాహితీ వేత్త జంధ్యాల శరత్ బాబు తదితరులు ఈ ప్రారంభ సభలో పాల్గొన్నారు.