హైదరాబాదు విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా దినోత్సవ కార్యక్రమాలు శుక్రవారంనాడు వైభవంగా ముగిసాయి. మహాకవి, బహుభాషావేత్త, పత్రికారచయిత, సంపాదకుడు చిన్నస్వామి సుబ్రహ్మణ్యభారతి జయంతిని ఈ యేడాదినుంచి భారతీయ భాషాదినోత్సవంగా జరపాలని భారతప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గడచిన పదిరోజులుగా విద్యార్థులకు, పరిశోధకులకు, ఉద్యోగులకు బహుభాషలలో అనేకమైన భాషా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

శుక్రవారంనాడు జరిగిన ముగింపు వేడుకల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మానవీయశాస్త్రాల డీన్ ఆచార్య కృష్ణ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య భారతి భాషా సాహిత్య సేవలను కొనియాడారు.  ఆయన జన్మదినోత్సవాన్ని భారతీయ భాషా దినోత్సవంగా జరుపుకోడం మనందరికీ గర్వకారణమన్నారు.  భారతి దక్షిణ-ఉత్తర భారతాలకు సేతువుఅని కీర్తించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాదు విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ఆచార్య బి.జె.రావు మాట్లాడుతూ భారతీయ భాషలలో లభ్యమవుతున్న సంపదను అధ్యయనం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.  భారతదేశం బహుభాషల నిలయమని చెబుతూ, విద్యార్థులంతా ఎక్కువభాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.  సుబ్రహ్మణ్య భారతి గొప్పకవి, మానవతావాది, బహుభాషాకోవిదుడు అని కొనియాడారు.

కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్-చాన్సలర్ ఆచార్య ఆవుల మంజులత తెలుగుభాష గొప్పదనం గురించి ప్రసంగించారు.   తెలుగుభాషతో పాటు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలు గొప్ప వ్యాప్తి పొందుతున్నాయన్నారు. మన భాషలలో లభ్యమవుతున్న విశేషాలను మనభాషలలోనే చదువుకొనేవిధంగా మన విద్యావిధానం మారాలన్నారు.  భారతీయ భాషలు నేర్చుకోడంవల్ల కలిగే ప్రయోజనాలను మరోవక్త ఆచార్య పురుషోత్తమరావు వివరించారు.

భారతీయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులకు నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలను ఆచార్య బి.జె.రావు బహూకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుభాషా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.  కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, ఆచార్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.