స్థానిక, ప్రాంతీయ భాషలను పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే 90 శాతం ఉన్న ప్రపంచ వ్యాప్తంగా స్థానిక భాషలు కనుమరుగైపోయి, 10 శాతం ఉన్న ఆధిపత్య భాషలే తమ పెత్తనాన్ని చెలాయించే ప్రమాదం ఉందని, దేశీయ భాషలను కాపాడుకోవడం వల్లే మానవ , సాంఘిక, కళాశాస్త్రాలు అభివృద్ధి చెందుతాయని సిఐఐఎల్ డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య ఉమారాణి పప్పు స్వామి పేర్కొన్నారు.
అంతరిస్తున్న భాషలు, మాతృ భాషల అధ్యయన కేంద్రం మరియు తెలుగు శాఖ,మానవీయ శాస్త్రాల విభాగం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా మంగళవారం (22.2.2022) నాడు అంతర్జాలం ద్వారా నిర్వహించిన ప్రత్యేక ప్రసంగం ”అంతరించి పోతున్న భారతీయ మాతృ భాషల పరిరక్షణ” అనే అంశంపై భారతీయ భాషల కేంద్ర సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య ఉమారాణి పప్పు స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యునెస్కో చెప్పిన భారతీయ దేశీయ భాషలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశీయ భాషలను పేర్కొంటూ, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యునెస్కో ప్రతియేడాదీ ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించడంతో పాటు, 2022 నుండి 2032 వరకు ఫిబ్రవరి 22 తేదీ నుండి *దేశీయ భాషల దశాబ్దం * గా కూడా ప్రకటించడం వల్ల ఈరోజు ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సామాన్య ప్రజలలో వాడుక లో ఉన్నటువంటి భాషనే బోధనలోను, పాఠ్యాంశాల్లోను చేర్చినట్లైతే ఆ భాష మృతభాష కాకుండా కాపాడుకోగలమని, స్థానిక భాషల పరిరక్షణలో స్థానిక పత్రికలు ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వబోతున్న వక్తలను పరిచయం చేస్తూ అంతరిస్తున్న భాషలు, మాతృ భాషల అధ్యయన కేంద్రం అధ్యక్షుడు పమ్మి పవన్ కుమార్ సమాజంలో భాష మానవుల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించడం లోనూ, సంస్కృతిని పరిరక్షించడం లోనూ, భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించడంలోనూ భాష శక్తివంతమైన పాత్రను నిర్వహిస్తుందని, అందువల్ల మాతృభాషలను లేదా స్థానిక భాషలను కాపాడుకోవాలన్నారు. స్థానిక భాషలు కనుక అంతరిస్తే జాతికి ఎంతో నష్టం కలుగుతుందని, అందువల్ల స్థానిక భాషలను వాటిని వివిధ పద్ధతులలో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని ఆచార్య పమ్మి పవన్ కుమార్ అన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలు మాట్లాడుకొనే భాషలకు కూడా ప్రామాణిక భాషలకిచ్చే ప్రధాన్యాన్నే ఇవ్వాలని అనువర్తిత భాషలు, అనువాద అధ్యయన కేంద్రం శాఖ అధ్యక్షుడు ఆచార్య భీమ్ రావు పాండా భోంస్లే పేర్కొన్నారు.
దేశీయ, స్థానిక, ప్రాంతీయ భాషలను పరిరక్షించుకోవడం ద్వారానే మన సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుందని ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. ప్రసంగానంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్ నుండి అనౌక్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుండి ఆచార్య రవిశంకర్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ ఆచార్యులు గోనా నాయక్, డాక్టర్ బి. భుజంగరెడ్డి, డాక్టర్ దాసర విజయ కుమారి, విద్యార్థినీ విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు.