హైదరాబాదు విశ్వవిద్యాలయం మానవీయశాస్త్రాల విభాగం-తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్న పమ్మి పవన్ కుమార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు అనే కేంద్రానికి ప్రణాళిక-పర్యవేక్షణ సంఘ సభ్యులుగా ఇటీవల నియమితులయ్యారు. ఈ కేంద్రం భారతీయ భాషల కేంద్ర సంస్థ(మైసూరు), ఉన్నతవిద్యాశాఖ, విద్యామంత్రిత్వవిభాగం, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
క్లాసికల్ తెలుగు కేంద్రం అమలుచేసే వివిధ విద్యాత్మక, పరిశోధన పథకాలను ప్రణాళిక-పర్యవేక్షణ సంఘం పరిశీలించి తగు సూచనలు చేస్తుంది. విశిష్ఠ భాషగా తెలుగును నిరూపించేందుకు తగిన పరిశోధనాంశాలను గుర్తించడం, సంప్రదాయ, ప్రాచీన తెలుగు భాష, సాహిత్యాలపై దేశవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న పండితులను, యువ పరిశోధకులను గుర్తించి, వారిని క్లాసికల్ తెలుగు కేంద్రం నిర్వహించే పరిశోధన కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం.. వంటి పనులలో ప్రణాళిక-పర్యవేక్షణ సంఘం సహకరిస్తుంది.
ప్రొఫెసర్ పవన్ కుమార్ ప్రణాళిక-పర్యవేక్షణ సంఘ సభ్యులుగా మూడేళ్ళపాటు కొనసాగుతారు.