భారతీయ భక్తి సాహిత్యం భారతీయులందరి మధ్యా సమైక్యతకు దోహదం చేసిందనీ, భిన్న వర్గాల వారందరినీ ఏకంచేసి భారతీయుల సమైక్యతను చాటిచెప్పడంలో భక్తి సాహిత్యం పాత్ర అనిర్వచనీయమైందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు వారు 27, 28 (27, 28 జూన్ 2022) వతేదీల్లో నిర్వహిస్తున్న తెలుగుశాఖ, అక్కమహాదేవి పీఠం, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ లను కలుపుకొని రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మంగళవారం నాడు సదస్సు ముగింపు సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తరభారతదేశంలో కాశ్మీర్ కు చెందిన 14 వశతాబ్దికి చెందిన లల్లేశ్వరి లల్లయోగీశ్వరిగా ప్రసిద్ధి పొందారనీ, . ఆమె సంస్కృతంలో చెప్పిన కవిత్వాన్ని లల్లావాక్యమంటారనీ, దాని ద్వారా కులమతాలకు అతీతంగా భక్తిబోధనలు చేశారని ఆయన వివరించారు. అటువంటి గొప్ప భక్తులు దక్షిణ భారతదేశంలో 12వశతాబ్దానికి చెందిన అక్కమహాదేవి శైవభక్తురాలుగాను, 18 వశతాబ్దానికి చెందిన తరిగొండవేంగమాంబ వైష్ణవభక్తురాలుగాను కనిపిస్తారనీ వీరి ద్వారా భక్తికి లింగభేదం ఉందడనీ ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు మీరాబాయి, కబీర్, అన్నమయ్య, భక్తరామదాసు మొదలైన వాళ్ళు మానవుల మధ్య భేదభావాలు లేకుండా భగవంతుడిని ఎవరైనా ఆరాదించవచ్చునని నిరూపించారన్నారు. తెలుగులో ఆముక్తమాల్యదలో గోదాదేవి పాత్ర ఎంతో ఉదాత్తమైందన్నారు. భాగవతం నవవిధ భక్తి మార్గాల్ని వివరించిందనీ, సాహిత్యంలో ‘భక్తి’ ని ఒక రసంగా కూడా ఆలంకారికులు పేర్కొన్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇలా తెలుగుతో పాటు ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ తదితర భాషల్లో వెలువడిన భారతీయ భక్తి సాహిత్యం (భాషా సంగమం–2022) పేరుతో జరిగిన సదస్సులో భారతీయుల ఆలోచనలన్నీ ఒకేవిధంగా ఉన్నాయని నిరూపించిందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
భారతదేశంలో సంస్కరణోద్యమంలో భాగంగా కూడా భక్తి ఉద్యమాలు వచ్చిన చరిత్రను మనం మర్చిపోలేమన్నారు. ప్రస్తుత సమాజంలో మానవుల మధ్య ఏకత్వభావనకు ఈ భక్తి సాహిత్య సదస్సు ఎంతో తోడ్పడుతుందని ఆచార్యవెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వహకుడు, సమన్వయకర్త కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు, పరిశోధన అధ్యయన విభాగం అధ్యక్షులు ఆచార్య ఎం.రామనాథం నాయుడు, కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ విద్యాశంకర్, అమెరికా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ పంచమహా సహస్రావధాని డా.మేడసాని మోహన్, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఆర్. రాజన్న, ఆచార్య సి.నాగన్న, ఆచార్య మొదలియార్, డా.సెల్వపిళ్ళ అయ్యంగార్, డా.జ్యోతిశంకర్, పరీక్షల విభాగం రిజిస్ట్రార్ ఆచార్య ప్రవీణ్, అకడమిక్ డీన్ ఆచార్య అశోక్, అక్కమహాదేవి పీఠం అధ్యక్షులు డా.హెచ్ .రాజేశ్వరి, డా.ఖాదర్ బాషా, డా. గీతాంజలి, డా.సత్యనారాయణ డా.నాగశేషు, డా.చక్రవర్తి వివిధ భాషాశాఖల అధ్యక్షులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.