నవ యుగ వైతాళికుడు, ఆధునిక సాహిత్యానికి వెలుగుబాట శ్రీ గురజాడ వేంకట అప్పారావు 163వ జయంతిని (సెప్టెంబర్ 21 తేదీని)పురస్కరించుకొని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ, అంతరిస్తున్న భాషలు, మాతృభాషల అధ్యయన కేంద్రం  ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాన్ని శుక్రవారంనాడు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు  అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తలుగా తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, అంతరిస్తున్న భాషలు, మాతృభాషల అధ్యయన కేంద్రం అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ ప్రసంగించారు.  ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి గురజాడ మేలును కొనియాడారు.  గురజాడ పుట్టిపెరిగిన ప్రదేశాలు, విద్యాభ్యాసం వంటి వివరాలను తెలిపారు. “కన్యాశుల్కం” నాటకంలోని ప్రధానమైన సామాజిక దృక్పథాన్ని వివరించారు. కళింగాంధ్ర భాషలో నాటకాన్ని రచించి సాహిత్యంలో అగ్రగామిగా నిలబెట్టారని, సమాజంలో నిలిచిపోయే పాత్రలను సృష్టించారని అన్నారు.

తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్ వారు గురజాడ జన్మదినోత్సవాన్ని “మానవతా దినోత్సవం” గా ప్రకటించారని తెలిపారు. గురజాడ రచించిన కథా సాహిత్యం, కవిత్వం గురించి విశ్లేషిస్తూ,దిద్దుబాటు, సంస్కర్త హృదయం, మీ పేరేమిటి? మెటిల్డా, పెద్ద మసీదు, సౌదామిని వంటి కథలను, ముత్యాలసరాలులో గల వివిధ కవితా ఖండికలను వివరించారు.

ఆచార్య పమ్మి పవన్ కుమార్ గురజాడ భాషా దృక్పథాన్ని వివరించారు. గురజాడ రచనలైన అసమ్మతి పత్రం, కన్యాశుల్కం, మొదలైన వాటిద్వారా గురజాడ ఆధునిక భాషా దృక్పథాన్ని విపులీకరించారు.  సమాజానికి అవసరమైన భాషను అందించడంలో గురజాడ విశేష ప్రజ్ఞను ప్రదర్శించారని కొనియాడారు.  ఆధునిక కవుల రచనలను అర్థంచేసుకోడానికి చారిత్రక దృక్పథం అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య పి. వారిజా రాణి, ఆచార్య వి. త్రివేణి, డా. భూక్యా తిరుపతి, డా. భుజంగరెడ్డి, డా.విజయ్ కుమార్, డా.బాశెట్టి లత, డా. డి.విజయ కుమారి, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.